Loading...

గురువారం 12 ఎప్రిల్ 2012

గజేంద్రుని ఆర్తి (నా పద్యములు)



పెద్దలకు నమస్కారము. 
గజేంద్రుని ఆర్తికి పద్యరూపం ఇచ్చెందుకు ప్రయత్నించాను.

ఇందులో కథ వివరంగా చెప్పలేదు. క్లుప్తంగా విషయం చెప్పాను. 
పెద్దల సూచనలు శిరోధార్యము.


చదువును జ్ఞానమునొసగి 
రి దయను గణపతియువాణిరేపవలును నా
మది వీడక కొలువుండగ
కుదురగు బుద్ధిని నిలుపగ కోరుచు నుందున్.


పరుగున నేతెంచి కరిని
హరి గాచిన తీరు యబ్బురమ్మది భువిలో
విరుగగ పాపపు చయములు
సరసముగా జెపుదు నిపుడు ఛందోరీతిన్.

పన్నగశయనుడవయి నెల
కొన్న కమల నయనుడయిన గోవిందాయా
పన్నుల గాచెడు దయ నీ
కున్నదనుచు నమ్మె యేనుగు తనదు మదిలో

స్థానబలముగల మకరమ
దేనుగు పాదమును బట్టి యీడ్చ,మడుగులో
తానే పోరెదననుకొని
దీనత పొందక జతనము తీరుగ చేసెన్.

కడకా గజమది యోడుచు
మడుగున నిన్నే పిలిచెను మాధవదేవా!
"వడివడిగా వచ్చి నిలిచి
విడు నీ చక్రముననుచును వేడెను తానే.

"సృష్టికి నీవే మూలము
భ్రష్టుడనైతిని తెలియక బ్రతుకుననెంతో
నష్టము పొందితి తండ్రీ!
కష్టము గట్టెక్క నన్ను కావగదయ్యా!"

జనకుండెవ్వరు ప్రాణికి,
జననియదెవ్వరుపతియునుజాయయదెవరో,
కనగా సంతును స్వంతమె?
యని నాకు కలుగగ చింతలచ్యుతనాథా!"

ఆదియునంతము నీవే
నాదనుదేమియును లేదునమ్మితి"ననగా
సాదరముగ కదలి కరిని
నీ దరి చేర్చి కరుణింప నీవేగితివే!

పాపపు చీకటులు తొలుగ
దీపము నీవైన కథల దెలుపుచునన్నున్
కాపాడెడు దైవమగుచు,

గోపాలావందనమిదె గొనుమాకృష్ణా!


------------------------లక్ష్మీదేవి.

సోమవారం 9 ఎప్రిల్ 2012

జగమే మాయ......


జగమే మాయ అనే పాట నాకు చాలా నచ్చింది. మొత్తం ప్రవచనాల సారం అంతా నాలుగు ముక్కల్లో చెప్పారు సముద్రాల గారు.

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా

 కలిమిలేములు కష్టసుఖాలు
కావడికుండలనే భయమేలోయీ
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయీ ఈ వింతేనోయీ

కావడి అని భుజంమీద ఒక కర్రను పెట్టుకొని దానికి పెద్ద తాడు కట్టి తక్కెడ మాదిరి ముందు వెనక కుండలు పెట్టుకొని నీళ్ళు మోస్తుంటారు. నీళ్ళు ఖాళీ అయి తేలిక కావటం, మళ్ళీ నీళ్ళు నింపుకుని బరువు మోయటం మారి మారి వచ్చినట్టు కష్టము, సుఖము, కలిమి, లేమి వచ్చి పోతుంటాయి. వాటి గురించి దిగులు చెందకు.
కంటికి కనిపించేదంతా భ్రమ. కావడి రూపంలో ఉన్నా మరే రూపంలో ఉన్నా అదొక చెక్క , కుండల రూపంలో ఉన్నా పగిలినా అది మన్ను తప్ప ఇంకేం కాదు. చెరువులో నీళ్ళు దోసిట్లో తీసుకున్నా అవీ ఇవీ కూడా నీళ్ళే కదా అలాగే జగత్తులో మనకు లభించేదంతా పరమాత్మ పెట్టిన భిక్ష. సుఖము, దుఃఖము అన్నిటినీ స్వీకరించు. అని అర్థము.

ఆశామోహముల దరిరానీకోయీ
అన్యులకు నీ సుఖము అంకితమోయీ
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఈ ఎరుకే నిశ్చలానందమోయ్
బ్రహ్మానందమోయ్

ఇది కావాలని, నాతోనే ఉండాలని ఆశలు, మోహాలు వదలిపెట్టు. ఎందుకంటే ఉండేది ఉంటుంది. పోయేది పోతుంది. ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం కాకపోవటమే ప్రకృతి సహజం. పంటభూమి బీడుగా మారటం, బీడు భూమి భవనంగా మారటం, భవనం కుప్పలా కూలిపోవటం. ఇలా మార్పు అనేది సహజం దీనిని స్వీకరించాలంటే మోహము వదలుకోవాలి.
పరులకొరకు జీవించాలి.
ఉద్యోగం చేసేటప్పుడు చాలా మటుకు సంస్థ లాభనష్టాలతో ఉద్వేగం చెందకుండా, మన జీతం మనకు వస్తుందా లేదా అని చూసుకున్నట్టే పరుల కొరకు ఉపయోగపడే పనులే చేస్తుంటే మోహం దరిజేరదు. విజయం వచ్చినా రాకపోయినా డిప్రెషన్ కు లోను కాకుండా మరలా పని చేస్తుంటాం. మనది అయితే అలా చేయలేం. కాబట్టి ఏదైనా నాకు, నాది అనుకోకుండా చేయగలగాలి.
బాధ , సౌఖ్యము అన్నిటినీ ఒకేలా స్వీకరించగలగాలి. ఎంత బాధ అయినా, ఎంత సంతోషం అయినా కాలం గడిచే కొద్దీ అది ఒక జ్ఞాపకం గా మిగులుతుందే తప్ప ఇంకేమీ కాదు. తండ్రి పోయిన దుఃఖమైనా, స్కూల్ ఫస్ట్ వచ్చిన సంతోషమైనా కొన్నాళ్ళకు అది ఒక జ్ఞాపకం. అంతే. ఇంకేమీ కాదు.ఇది తెలుసుకోవటమే ముక్తి, బ్రహ్మానందం. తెలుసుకోవటం అంటే ఈ పదాలకు అర్థం తెలియటమో, ఇలా వ్రాయగలగటమో కాదు. ఇది ఫీల్ కాగలగాలి. ఆ భావన చేయగలగాలి అని అర్థం.
పాట ఇక్కడ వినండి.

http://mp3skull.com/mp3/jagame_maya.html

మంగళవారం 27 మార్చి 2012

తెలుగులో హనుమాన్ చాలీసా---- యెమ్మెస్ రామారావు రచన పూర్తి పాఠం


శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు        ||శ్రీ||

౧.} జయ హనుమంత జ్ఞానగుణవందిత
జయపండిత త్రిలోక పూజితా
౨.} రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుతనామా
౩.} ఉదయభానుని మధురఫలమని
భావనలీల అమృతమును గ్రోలిన
౪.} కాంచనవర్ణ విరాజితవేషా
కుండలమండిత కుంచితకేశా
౫.} రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజ పదవి సుగ్రీవున నిలిపి
౬.} జానకీపతి ముద్రిక తోడ్కొని

జలధి లంఘించి లంక చేరుకొని
౭.} సూక్ష్మరూపమున సీతను జూచి
వికట రూపమున లంకనుగాల్చి
౮.} భీమరూపమున అసురుల జంపిన
రామకార్యముసఫలము జేసిన                ||శ్రీ||

౯. } సీతజాడ గని వచ్చిన నినుగని
శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని
౧౦) సహస్ర రీతులా  నిను కొనియాడగ
 కాగల కార్యము  నీపై నిడగా
౧౧) వానర సేనతో  వారిధి దాటి
 లంకేశుని తో  తలపడిపోరి
౧౨) హోరు  హోరున  పోరు సాగినా
 అసుర  సేనల  వరుసన గూల్చిన           !!శ్రీ!!

౧౩) లక్ష్మణ  మూర్చతో  రాముడడలగా
 సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత
౧౪) రామ లక్ష్మణుల  అస్త్ర ధాటికి
 అసుర వీరులు  అస్తమించిరి
౧౫) తిరుగులేని  శ్రీ  రామ భాణమూ
 జరిపించెను  రావణ  సంహారము
౧౬) ఎదిరి లేని ఆ లంకాపురమున
 ఏలికగా  విభీషణు  చేసిన               !!శ్రీ!!

౧౭) సీతా రాములు  నగవుల గనిరి
 ముల్లోకాల  ఆరతులందిరి
౧౮) అంతులేని  ఆనందాశృవులే
 అయోధ్యాపురి  పొంగిపోరులే
౧౯) సీతా రాముల  సుందర  మందిరం
 శ్రీకాంతు  పదం  నీ హృదయం
౨౦) రామ చరిత  కర్ణామృత గానా
 రామ నామ  రసామృత పాన              !!శ్రీ!!

౨౧) దుర్గమమగు ఏ  కార్య మైనా
 సుగమమే యగు  నీ కృపచాలిన
౨౨) కలుగు  శుభములు  నిను  శరణన్నా
 తొలగు  భయములు  నీ రక్షణ యున్నా
౨౩) రామ  ద్వారపు  కాపరి వైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
౨౪) భూత పిశాచ  శాకినీ    డాకిని
 భయపడి  పారు నీ  నామ  జపము  విని           !!శ్రీ!!

౨౫) ధ్వజావిరాజా  వజ్ర శరీర
 భుజ బల తేజా  గదాధరా
౨౬) ఈశ్వరాంశ   సంభూత పవిత్ర
 కేసరీ పుత్రా  పావన గాత్ర
౨౭) సనకాదులు  బ్రహ్మాది దేవతలు
 శారద  నారద  ఆది  శేషులూ
౨౮) యమ కుబేర  దిక్పాలురు కవులూ
 పులకితులైరి నీ కీర్తి  గానముల            !! శ్రీ!!

౨౯) సోదర భరత  సమానాయని
 శ్రీ రాముడు  ఎన్నికగొన్న  హనుమా
౩౦) సాధుల  పాలిట  ఇంద్రుడ వన్నా
 అసురుల  పాలిట  కాలుడవన్నా
౩౧) అష్ట  సిద్ధి  నవనిధులకు దాతగా
 జానకీమాత  దీవించెను గా
౩౨) రామ రసామృత  పానము చేసిన
 మృత్యుంజయుడవై   వెలసినా              !!శ్రీ!!

౩౩) నీ నామ  భజన  శ్రీ  రామ  రంజన
 జన్మ  జన్మాంతర  దుఖ భంజన
౩౪) యెచ్చ టుండినా  రఘువరదాసు
 చివరకు రాముని  చేరుట తెలుసు
౩౫) ఇతర చింతనలు  మనసునమోతలు
 స్థిరముగా మారుతి సేవలు సుఖములు
౩౬) ఎందెందున  శ్రీ  రామ  కీర్తన
 అందందున  హనుమాను  నర్తన               !!శ్రీ!!

౩౭) శ్రద్ధగ దీనిని  ఆలకింపుమా
 శుభమగు ఫలములు  కలుగు సుమా
౩౮) భక్తిమీరగ  గానము సేయగ
 ముక్తి  కలుగు  గౌరీశులు   సాక్షిగా
౩౯) తులసిదాస  హనుమాను  చాలీసా
 తెలుగున  సులువుగ  నలుగురు పాడగ
౪౦) పలికిన  సీతారాముని   పలుకున
    దోసములున్న  మన్నింపుమన్నా             !!శ్రీ!!

మంగళ  ఆరతి  గొను  హనుమంతా
 సీతా రామ  లక్ష్మణ  సమేతా
నా అంతరాత్మ  నేలుమో  అనంతా
 నీవే అంతా  శ్రీ  హనుమంతా  ...ఆ ఆ .............
ఓం  శాంతి  శాంతి  శాంతి:.




శనివారం 25 ఫిబ్రవరి 2012

కాలభైరవాష్టకం



ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాశీ అనబడే వారాణసికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.

నేను ఇక్కడ రాసుకున్నట్టుగా కాకుండా
మస్తశూన్య కు మక్షశూల
నిర్మలమ్ బదులు మండలమ్
నిక్వణ్మనోజ్ఞ బదులు వినిక్వణ్మనోజ్ఞ అని కొన్నచోట్ల ఉంది.

బాలు గారి స్వరంలో గంభీరంగా ఎక్కడో విన్నట్టు గుర్తు.
ఆ లంకె  దొరకలేదు.
ఇందులో తప్పులేమైనా ఉంటే తెలిసిన పెద్దలు సవరించగలరు
http://mp3download.ws/mp3/ASa08VbK5V4/Kalabairava%20Astakam/Kalabhairava+Ashtakam/



దేవరాజ సేవ్యమానపావనాంఘ్రిపంకజమ్
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరాం కృపాకరమ్
నారదాదియోగివృందవందితం దిగంబరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||   ౧

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరమ్
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమస్తశూన్యమక్షరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨

శూలటంకపాశదండపాణిమాదికారణమ్
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||   ౩

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహమ్
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||  ౪

ధర్మసేతు పాలకం స్వధర్మమార్గనాయకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకమ్
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే  || ౬

అట్టహాస భిన్నపద్మజాండకోశసంతతిమ్
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే  || ౭

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకమ్
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮

ఫలశ్రుతి
కాలభైరవాష్ఠకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనం
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం యే
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ద్ధృవం ||
|| ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||



ఆదివారం 19 ఫిబ్రవరి 2012

పదాలతో సదాశివుని పదార్చన







దేవరా! నను గావుమయ్య సతీమనోహర!శంకరా!
దీవనల్ గొన కాచియుంటిమి తృప్తిమాకది నిచ్చు, మా
భావనా జగమంత నిండిన వాడివై కనిపించరా!
నీవె నాకిక దిక్కు,నేరమునెంచకో పరమేశ్వరా!        (మత్తకోకిల)


నటనలొప్పెడి నాట్యశాస్త్రమునందునొజ్జవు నీశ్వరా!
జటలధారివి సుందరమ్మున సాటిగా మరి లేరురా!
భటులపై కరుణారసమ్ము నపారసంద్రము పోలురా!
జటిలమైన భవాబ్ధి పారణ సాగ నీదయ నిమ్మురా!         (తరలము)


మహేశ్వరుండవై, శుభమ్ముమాకు చేయబూనుమా!
సహాయమున్ దయాళువై ప్రసాదమిమ్ము,కోరితిన్
మహానుభావులెందరో హిమాంశుధారునెప్పుడున్
మహామహుండుగా నివాళి మానకుండజేతురే!          (పంచచామరము)


గౌరీనాథుని మనమున
నారాధింపగ నవిద్య నజ్ఞానములున్
చేరక నిర్మలమగునట,
ఆరాటమ్ములు తొలగునటంచును చెపుమా!               (కందము)


నినుగని పొంగిపోవగ ననేకములైన మనోవికారముల్
ననువిడిపోవు నిక్కముగ, నాకములన్నియు నన్నుచేరునే!
మనమిక వెండికొండయగు, మాటయె మంత్రము కాకయుండునా
వినుమొక మాఱు నాదు మొఱ, వేడితి నీకడ నాదిదేవరా!                        


 (చంపకమాల)


ఇంటికి నీవె దైవమయి యెప్పుడు బ్రోచుచు నుండువానివే!
కంటికి రెప్పవై మముల కాచెడు జంగమవీవు దేవరా!
మంటను కంటిలో గలిగి మన్మథ మాయను గెల్చువానిగా
బంటుల తోడునీడవయి భక్తిని పెంచుము రక్తి వీడగన్.                                


 (ఉత్పలమాల)


మాయామర్మమెఱుంగమయ్యనభవా! మమ్మేల రావేలనో
కాయమ్మందున లావు తగ్గెనిక నాకై జాలి చూపించవో! 
న్యాయమ్మీ భువి లేదులేదు, నరులన్యాయంబునే నమ్మిరే!
చేయూతమ్మిడి,భక్తిభావములనే చిత్తమ్ములో నింపుమా!                        


 (శార్దూలము)


నరుడా పొద్దున కొట్టబోయినను బాణాలిచ్చి దీవించవే! (దీవించలేదా అని భావము)
కరువా ముద్దకు నన్నపూర్ణ మగడా! గైకొంటి యెంగిళ్ళనున్,
వరముల్ కోరుచు నిన్ను వేడగనె పాపాలెంచబోవందురే!
గురువే నీవని నమ్మియుంటినిను; నే కోరంగ లేదందువా! (లేదనవు అని భావము)  


 (మత్తేభము)





(ఆష్టమూర్తితత్వమైన ఆదిదేవునికి అష్టపదార్చన.


చివరి ఐదు శ ష స హ(నిషిద్ధాక్షరిలో) లేకుండా శివపూజ
శంకరాభరణం బ్లాగులో నా సమాధానాలు.)

---లక్ష్మీదేవి